27, మార్చి 2010, శనివారం

26, మార్చి 2010, శుక్రవారం

మా జొస్నా పాప

మా జోస్నా పాప ఈ మద్దెనే నడుస్తా ఉంది.అది ఒక్కటే చెయ్యి ముందుకూ ఎనక్కీ ఊపుకుంటా సొరిగి సొరిగి,నడుస్తా ఉంటే అందరూ చెయ్యి బో ఊపతా ఉందబ్బా పిల్ల అని  అంటా ఉండారు.అది శివరాతిరి రోజు పుట్టిందంట.ఆ యాల యాడ జూసినా గుగ్గిల్లే.పిల్లొల్లకయితే బో పండగ.మొన్న పండక్కయితే మాజేజి అలసంద గుగ్గిల్లు చేసింది.
మా జోస్నాపాపకు పుట్టిన రోజు గూడా ఆయాలనే చేసిండ్రు.కొండంత పండగ రోజు పుట్టింది కదా, ఇంక వేరే రోజుల్లో చేసేదెందుకులెమ్మని మా మగేసు మామ ఆయాలనే ఆయమ్మికి పుట్టినరోజు చేసిండు.మా బబ్బు గానికయితే బాగ అందర్నీ పిలిసి,కేకు కోసి,బోజినాలు పెట్టించి చేసిండ్రుగాని ఆయమ్మికయితే అయ్యన్నీ ఏమీ చేయల్యా.ఊరికనే కొత్త గుడ్డలు తొడిగిచ్చిండ్రు.మా అత్త అడిగిందంట గాని,ఆ...ఏమిలే ....అన్నడంట మా మామ.దాని  పుట్టిన్రోజు శివరాత్రి పండగలో కలిసి పోయింది.
మా జోస్నా పాప పుట్టినప్పుడు మాయత్త మానాయన్ని ముద్దుగా పిల్చుకోనీకి,పేరు పెట్టమని అడిగిందంట.మా బబ్బుగానికి కూడా మానాయినేనంట పేరు పెట్టింది.వాని అసలు పేరు ఫణి గాడయితే,అందరూ బబ్బు,బబ్బు అనేదే వాడికయింది.అట్టనే ఏదన్నా పేరు పెడతడు గదాని మాయత్త మానాయిన్ని అడిగిందంట.అప్పుడు మా నాయిన దానికి దూదు అని పెట్టమ్యా అన్నడంట.దానికి మాయత్త ఒప్పుకోనే లేదంట.మా నాయిన ఇప్పటికీ ఆ సంగతి చెబుతా ఉంటాడు.
దూదు అనే పేరు అచ్చిరాదని మాయత్త ఆపేరు పెట్టలేదంట.దూదూ అనే పేరు మేము పల్లెలో ఉండంగ,నేను పుట్టక  మునుపు, ఎప్పుడో చానా రోజుల కిందట మా నాయిన ఒక కుక్క పిల్లకు పెట్టిండంట.ఒకపారి బాగా వాన కురుస్తున్నదంట.దూదూ తల్లి దాన్ని వదిలి పెట్టి యాడికో పోయిందంట. అప్పుడు అది ఏడ్సుకుంటా,తిరుగుతా,తిరుగుతా మురుక్కాలవలో పన్నదంట.మానాయిన సూసి,దాన్ని సుబ్రంగ తుడిసి, ఇంట్లో పెట్టుకున్నడంట.అపుడు దానికి నడిసేది కూడా రాకుండున్నదంట.అప్పుడే దాని కి దూదూ అన్న పేరు పెట్టిండంట మా నాయిన.దూదేంది నాయినా, అంటే మానాయిన ఒక కత చెప్పుకొచ్చిండు.
ప్యారీసు పతనం అని ఒక బుక్కున్నదంట. దాంట్లో కతలో, ఒకచిన్న బాబుంటడంట.వాని పేరు దూదంట.వానమ్మ వాన్ని బాగాపెంచుతా ఉండేదంట.వాడు బళే ముద్దుగుంటడంట.ఆ పేరు మానాయినకు నచ్చి కుక్క పిల్లకుగూడా ఆ పేరే పెట్టిండంట. అయితే ఉండంగుండగా,దూదు అమ్మకు పిచ్చి పట్టిందంట.చచ్చిపోయిందంట.అమ్మ లేకపోయేటాలికి,దూదుకూ పాలే లెవ్వంట.అప్పుడు మానాయిన దాన్ని సాకిండంట.ఒకపారి అది ఒక దుడుకు పని చేసిందంట.అది చెప్తే బో నవ్వొచ్చది.పల్లెలో మేమున్న ఇంటికి దగ్గర్నే నాయంత ఉండే పిల్లొల్లు,దూరంగా పోలేరుకదా_అట్టాటోల్లంత జియ్య కూచ్చునేటోల్లంట.ఒకపారి ఒక పిల్లోడు జియ్య కూచ్చుంటూంటే మా దూదు వాని కాడికి పొయ్యి, అట్ట మూచ్చూసి,ఇట్ట మూచ్చూసి వాని బెల్లం కొరికిందంట.వాడు బయపడి దిక్కు తెలియకుండా ఏడ్చిండంట. ఇది జరిగినాక వాని అమ్మా నాయినా బో కొట్లాడుకున్నరంట. పిల్లోన్ని ఇడిచి పెట్టి పోతవాని, పెండ్లాం మీద బలే తగాదాడిండంట ఆయన.
ఇట్ట పెరుగుతా ఉండంగ, దూదూకు గూడా  పిచ్చెక్కిందంట.ఇంగ పట్టిచ్చుకునే వాల్లు లేక,చివరకు అట్ట తిరిగి ,ఇట్ట తిరిగి లారీ కింద పడి చచ్చి పోయిందంట.ఇదంతా చెప్పి,అందుకే నేను ఆపేరు వద్దనింది, అంటది మాయత్త.
ఆ పుస్తకంలో దూదూ కత గూడ ఇంతే అయితదంట.వాడు చివరకు,వాని అమ్మ చూస్తా ఉండంగనే,జబ్బు చేసి చచ్చిపోతడంట.

నా ఏడుపు

చిన్నప్పుడు నేను ఊరెత్తకపోయేటట్టూ ఏడ్చేదాన్నంట . నా ఏడుపుకు చుట్టుపక్కలవాళ్ళు కూడా హడలి పోయేవాళ్ళంట.పల్లెలో ఉన్నప్పుడయితే చుట్టుపక్కల వాళ్ళు పొద్దున్నే అడిగే వాళ్ళంట,ఏమి పిల్ల అట్టా ఏడుస్తుందేమని.పిల్ల చూడ్డానికి బాగుందిగాని గొంతేంది తల్లీ,ఆమైనుంది,అనేవాళ్ళంట.నాకు ఇంకా ఏడాది నిండక ముందు ఒకపారి ఏడుపుకెత్తుకున్ననంట.అప్పుట్లో నాకు మాటిమాటికి బేదులు అయ్యేవంట.నాఏడుపు చూసేసరికి పిల్లకు ఏమైందబ్బాఅని మా పెద్దోల్లంతా కిందా మీదైండ్రంట.మా అమ్మమ్మ పొద్దు మరీపోకముందే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి,మళ్ళీ పొద్దు పోయిందంటే డాక్టర్ అందుబాటులో ఉండడు,అనిందంట.అప్పుడు మాయమ్మా,నాయినా నన్ను సంకనేసుకోని ఆటోలో జయశంకరు డాక్టర్ దగ్గరకు పరిగెత్తిండ్రంట.నేను ఆటోలో ఎక్కిన కాసేపటికే ఏడుపు ఆపేసిన్నంట.మెదలకుండా ఉన్ననంట.నేను మెదలకుండాఉండేది చూసి పిల్లకు ఏం బాగాలేదు అని  డాక్టరు అడిగితే ఏంచెప్పాల్నబ్బా అని మొకమొకాలు చూసుకున్నరంట.
  నేను ఏడ్చినప్పుడల్లా మాయమ్మ ఎగిరెగిరి సముదాయిచ్చేదంట.మానాయిన చెప్పిండు.ఇప్పుటికీ దాన్ని గుర్తు చేసేదానికి మానాయిన నన్ను ఎత్తుకోని నవ్వుతాలకు పైకీకిందికిఎగురుతా ఉంటాడు.అప్పుడు మాయమ్మ కోపం తెచ్చుకుంటా సాలుసాల్లే,మీ తమ్ముడూ,సెల్లీ లేరా; వాల్లు ఎట్టా సముదాయిచ్చుకునేది మేము చూడమా అంటా ఉంటాది.నేను ఏడ్సేదాని గురించి ఎవురన్నా అనుకునేటప్పుడు నాకు మా జేజినాయిన గుర్తుకొస్తాడు.జేజినాయినంటే నాయిననాయిన.నేను మాజేజినాయినను కూడా తాతానే పిల్చేదాన్ని.మా నాయిన, తాతేందీ? అమ్మ నాయినయితే తాత అనాలా,జేజినాయినను పట్టుకోని తాత అంటావేంది అనేవోడు.నాకేమో తాత అనేదే అలవాటయింది.మాయమ్మకెల్లి అమ్మ నాయిన్నయినా,నాయిన నాయిన్నయినా తాతనే అంటరంట.అందుకే నాకూ, ఇద్దర్నీ తాత అనేది అలవాటయింది.
మా జేజినాయిన నేను ఏడ్చేది మొదులు పెట్టంగనే కాసేపు చూస్ఛూసి,అందర్నీ గెదుముకుంటా ఇంక నన్ను సముదాయిచ్చేదానికి  దిగేవోడంట. గబగబా మంచానికి ఉయ్యలేసేటోడంట.ఉయ్యాలంటే పైనుంచీ కిందికి ఏసేది కాదు.మంచానికే,ఒక పక్క కాళ్ళకు  రెండు పేట్లగ తాడు కట్టి, ఆ తాడు పేట్ల మద్దెన దుప్పటి ఇరికిచ్చి,మళ్ళీ అది ఊడకుండ సుట్లు సుట్టి అందులో నన్ను పండేసేటోడు.అట్ట కట్టేదానికి మాయమ్మకుగాని,మానాయినకుగాని,మాజేజికిగాని రాదు.మాయత్త మాత్రం సుమారుగ కట్టేదంట.అట్ట ఆయన ఉయ్యాల కట్టినాంక,ఇంక ఊపీ ఊపీ పాడేవోడు.రార రార రార చిన్నోడా; రారా,నాగేంద్రస్వామి రారా,రారా నాయినా పిల్ల ఏడుస్తా ఉంది,అని ఎత్తుకునేటోడు.నేను ఆయన అట్టా ఎత్తుకోంగనే ఆగిఆగి ఇంటా,ఏడ్చేదాన్నంట.నేను ఆ పాటలో పడి కొద్దికొద్దిగ గొంతు తగ్గియ్యంగనే ఆయన చూడు నా దెబ్బ అన్నట్టుగ అందరితట్టూ చూసేటోడంట. ఈ తతంగమంతా చూసి చుట్టు పక్కనంతా ముసిముసిగ నవ్వుకునేటోళ్ళంట.ఈయన పిల్లను సముదాయిచ్చుండడా లేకుంటే సిన్న కొడుకును తలుచుకుంటుండడా అనేవాల్లంట.మా బాబాయి పేరు నాగేంద్ర అయిందాన వాల్లు అట్టా ఎగతాలి చేసేటోల్లు.అప్పుడు మా బాబాయి తిపురాంతకంలో ఉండేటోడు.ఎప్పుడో పది రోజులకొకపారి ఇంటికొచ్చిపోయేటోడు.
అట్లా ఊపిచ్చుకోని ఊపిచ్చుకోని ఎప్పుటికో నేను నిద్రపోయేదాన్ని.అప్పుడు మాజేజినాయిన పిల్లను గూడా సముదాయిచ్చుకునేది గూడా రాదు ఎందుకే మీరు? అని మాజేజితట్టు చూసి అనేటోడు.మా జేజి అప్పుడు ఇంక సాలు పోయ్యోన్నట్టుగ నవ్వేదంట.

నాగురించి చెప్పనా

నాపేరు మిన్నల్. మిన్నల్ అంటే అరవంలో మెరుపంట.నేను చిన్నప్పుడు,అంటే బాగాచిన్నగా ఉన్నప్పుడు,పుట్టిన ఒకటీ,రెండు నెలల దాంకా ఏం పేరుపెట్టేదీ మా అమ్మనాయినకు ఏం పాలు పోలేదంట.ఏమి ఇంకా పిల్లకు పేరు పెట్టలేదు అని అందరూ అడగబట్టిండ్రంట.అప్పుడు మానాయిన మీ అమ్మ వయిపు వాళ్ళు అరవోళ్ళు గదా,ఇది ముందు ముందు తెలుగు మాట్లాడబోతది,అందుకని గుర్తుగా అరవ పేరు పెడితే బాగుంటది గదా అన్నండంట. అప్పుడు మాయమ్మ సరేనంటే సరేనన్నదంట.ఇంక ఏంపేరు పెడదామబ్బా అనుకుంటా,ఒక పెద్దయన్ని అడిగిండ్రంట.ఆయన అరవంలో కొన్ని పేర్లు చెప్పిండంట.ఎతికెతికి చివరకు మిన్నల్ అన్న పేరు నచ్చిందంట.అప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళింట్లో బుల్లిపాపగ ఉన్నానంట.మిన్నల్ అని చెప్పంగనే మా అమ్మమ్మ మిన్నలేంది,ఏమన్నదేవుండ్ల పేర్లు పెట్టుకుంటారు గానీ,మెరుపు_ ఇట్టా పెట్టుకుంటారా అన్నదంట.మా అమ్మావాళ్ళు ఏమీ బదులు చెప్పకుండా సయిగ్గా మిన్నల్,మిన్నల్ అనబట్టిండ్రంట.
ఇప్పుడు నేను ఎల్కేజీ చదువుతున్నా.నా చదువు గురించి చెప్పాల్నంటే చానా ఉంది.నేను ఫస్ట్ నర్సరీలో చేరిన.ఆడ కాంతా మిస్సు ఉండింది.నర్సరీలో ఏబీసీడీలు, నంబర్స్ ఇంకా చానా వచ్చేసినయి.చానా అని చెప్పేదానికి మా స్కూల్లో రెండుచేతులూ బార్లా చాచి చూపెట్టేది ఉప్పలపాడు జ్యోత్స్న అనే ఆయమ్మి నాకు నేర్పింది. ఇప్పుడు నాకెంత చదువు వొచ్చేసిందో చెప్పడానికి నేను చేతులు అట్ట చాచుకోని నిలబడింది మీకు కనపడుతోందా.